
Sri Sarada Devi Charitamrutam Vachanamrutam - శ్రీ శారదాదేవి చరితామృతం వచనామృతం
శ్రీ శారదాదేవి చరితామృతం (రెండు పుస్తకములు)
సనాతన భారతదేశం, భారతీయ హైందవ స్త్రీకి సజీవరూపం దివ్యజనని శ్రీ శారదామాత. తన దివ్యత్వాన్ని మాతృత్వపు మధురసుధగా మార్చి తననుతాను వ్యక్తపరచుకున్నారు శ్రీశారదామాత. శ్రీరామకృష్ణ పరమహంస సహధర్మచారిణిగా, శ్రీరామకృష్ణ సంఘజననిగా, గురువుగా ఆమె తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. తనను ‘అమ్మా‘ అని ఎవరు పిలిచినా వారి యోగక్షేమాలు తాను వహిస్తానని, తాను ఎంతటి ఆధ్యాత్మిక భూములను అధిరోహించినా, మూర్తీభవించిన దివ్యత్వమే తాను అయినా ఒక సామాన్య స్త్రీలాగ, నిరాడంబర జీవితం గడిపి, సహనం, ఓర్పు, త్యాగం, సేవ, పవిత్రత, ప్రేమ వంటి గుణాలతో శోభించి భారతీయ మహిళాదర్శాన్ని స్వయంగా ఆచరించి చూపారు శ్రీశారదామాత. మాతృత్వపు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పావన చరిత ఆమె. నేడు వేలాది జనుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చి, గృహస్థుల తాపాన్ని చల్లార్చే పావన నదిలా, సాధకులకు ఆధ్యాత్మిక ఛాయను ప్రసాదించే మహావృక్షంగా నిలిచారు శ్రీ శారదాదేవి. చక్కని, సులభశైలిలో సాగిన ‘శ్రీశారదాదేవిచరితామృతం‘ అందరూ చదువతగ్గది.
శ్రీ శారదాదేవి వచనామృతం
‘శ్రీశారదాదేవివచనామృతం’ చదవనిదే శ్రీశారదాదేవి చరిత్ర సమగ్రంగా చదివినట్లు కాదు. మాతృదేవి దైనందిన జీవితం ఎలా గడిచిందో, భక్తులకు ఆమె ఎలా మార్గం చూపించారో, గృహస్థుల కష్టనష్టాలలో ఎలా పాలు పంచుకున్నారో, అర్హులైన వారికి ఎలా ఆధ్యాత్మిక స్థితులను చూపించారో – ఇవన్నీ ఈ గ్రంథంలో కానవస్తాయి. అమ్మ దివ్యసాంగత్యాన్ని పొంది తరించిన వారిలో స్త్రీలు, పురుషులు, గృహస్థులు, సన్న్యాసులు ఇలా ఎందరో ఉన్నారు. వారు వ్రాసిన స్మృతుల సమాహారమే ఈ దివ్యగ్రంథం. భక్తులకు ఆశీస్సులిస్తూ అమ్మ వ్రాసిన లేఖలు కూడా ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ” నీకు కష్టం వచ్చినప్పుడు నాకు ఒక అమ్మ ఉంది అని గుర్తుకు తెచ్చుకో ‘అన్న శ్రీ శారదాదేవి అభయవాక్కులపై విశ్వాసాన్ని ఈ గ్రంథపఠనం మరింత పెంచుతుంది. దైనందిన జీవితాన్ని ఎలా పారమార్థికీకరణ చేసుకోవాలో తెలుపుతుంది.